భగవంతుడు తన భృత్యులకు విధియించిన ప్రథమ కర్తవ్యము: తన దివ్యావిష్కరణమునకు అరుణోదయమును, తన శాసనోద్భవము నకు స్రవంతియును, తన దివ్యధర్మ సామ్రాజ్యము, సృష్టి ప్రపంచము రెండింటియందునను దివ్యత్వమునకు దౌత్యకర్తయగు ‘ఆయన’ ను గుర్తించుట. ఈ కర్తవ్యమును నెరవేర్చినయాతడు సకల శుభసాధకుడు; తద్విహీనుడెంతటి సత్కార్యకర్తయైనను, దాని నుండి వైదొలగినట్లే. ఈ మహోత్కృష్ట స్థానమును, ఈ మహామహిమోపేత శిఖరమును అందుకొనిన ప్రతియొక్కడును, లోకాపేక్షితుడగు ‘ఆయన’ ప్రతి శాసనమును పాటింపవలె. ఈ కర్తవ్యద్వయ మవిభాజ్యము. ఇందేదియును రెండవది లేకుండ అంగీకారయోగ్యము కాదు. దివ్యప్రేరణకు మూలాధారుడగు ‘ఆయన’ చే నివ్విధముగ నాదేశింపబడినది.
భగవంతునిచే నంతర్దృష్టి ప్రసాదింపబడినవారు, ఈ ప్రపంచ సంవిధాన సంరక్షణకు, దీని ప్రజాభద్రతకు అత్యుత్తమ సాధనములుగ భగవంతుడేర్పరచిన ధర్మసూత్రములను యిట్టే గ్రహియింతురు. వాటినుండి వైదొలగినవా డధములయందునను, అవివేకుల యందునను ఒకనిగ గణియింపబడును. మీ దుర్మోహముల, నికృష్ట వాంఛల యాదేశములను తిరస్కరింపుడనియు, మహోన్నతుని దివ్యలేఖిని స్థిరీకృతమొనరించిన హద్దులు సకల సృజితములకును జీవనశ్వాస యగుటచే, వాటిని మీరవలదనియు, మేము నిశ్చయముగ మిమ్మాదేశించినాము. సకల దయామయుని ఉచ్ఛ్వాసమారుతమునుండి దివ్య జ్ఞాన, దివ్యభాషణా సాగరము లుద్భవించినవి. ఓ విజ్ఞులారా ! అత్యధికముగా సేవించుటకై త్వరనొందుడు. భగవంతుని యాదేశముల నతిక్రమించుట ద్వారా ‘ఆయన’ దివ్యఒడంబడిక నుల్లంఘించి తిరోగమించిన వారు సమస్త సంపన్నుడూ, సర్వోన్నతుడూనగు భగవంతుని దృష్టియందున మహాపరాధము నొనరించినారు.
ఓ ప్రపంచ జనులారా! నా యాదేశములు నా భృత్యుల యెడ నా ప్రేమాన్వితానుగ్రహ దీపికలనియు, నా సృజితజీవులకు నా కరుణాన్విత కుంచిక(తాళపుచెవి) లనియు నిశ్చయముగ తెలిసికొనుడు. ఆవిష్కరణాధిపతి యగు భగవంతుని యిచ్ఛాస్వర్గము నుండి ఇవ్విధముగ నిది యనుగ్రహీతమైనది. సకల దయామయుని యధరము లుచ్చరింపనెంచిన పదముల మాధుర్యము నే మానవుడైనను చవిచూచెనేని, ‘ఆయన’ ఔదార్యోపేత సంరక్షణ, ప్రేమోపేత కారుణ్యముల అరుణోదయముపై శోభిల్లు ‘ఆయన’ యాదేశముల యందలి ఏ యొక్కదాని సత్యనిరూపణకైనను - భూలోకమందలి సకలసంపదలును తన యాధీనమందున్నను వానినన్నింటిని త్యజియించును.
వచించు : నా శాసనముల నుండి, నా వస్త్రపు సుమధురపరిమళము నాఘ్రాణింపవచ్చును, వాటి సాహాయ్యమున మహోన్నత శిఖరములపై విజయధ్వజములను నిలుపవచ్చును. నా సర్వశక్తియుతమహిమాన్విత స్వర్గమునుండి నా యధికారవాణి నా సృష్టి నుద్దేశించి ఇవ్విధముగ పలికినది: “నా సౌందర్యాపేక్షకై నా యనుశాసనముల ననుసరింపుడు.” ఏ జిహ్వయును వర్ణింపజాలని కారుణ్యసౌరభ ప్రపూరితములగు యీ ప్రవచనముల నుండి పరమప్రియతముని దివ్యపరిమళము నాఘ్రాణించిన ప్రేమికుడు సంతోషాన్వితుడు. నా జీవితము సాక్షిగా ! నా దయానుగ్రహయుత హస్తముల నుండి న్యాయమను శ్రేష్ఠమధువును గ్రోలిన యాతడు నా సృష్ట్యోదయమున కెగువన శోభిల్లు నా యనుశాసనముల చుట్టును పరిభ్రమించును.
అప్రతిహతమగు ‘ఆయన’ యాదేశమునుండియే సమస్తమును ఆవిర్భవించినది. నాదగు ఉచ్చారణా స్వర్గమున సూర్యుని వోలె నా శాసనము లగుపించునపుడు, అవి - నా తీర్పు ప్రతి మతధర్మపు స్వర్గమును ఛిన్నాభిన్నమగు నట్లొనరించునదైనను - ప్రతి యొక్కనిచేతను విధేయతా పూర్వకముగ ననుసరింపబడవలె. ‘ఆయన’ తనకు ప్రమోదకరమగు దానినే నిర్వర్తించును. ఎంచుకొనువా ‘డాయన’, ఆయన ఎంపిక నెవ్వరును ప్రశ్నింపలేరు. పరమ ప్రియతముడగు ‘ఆయన’ నిర్దేశించినదేదైనను, నిశ్చయముగ ప్రియతమమే. సకలసృష్ట్యాధినాధుడగు ‘ఆయన’ నన్నిందులకు సాక్ష్యముగ నిలిపినాడు. సకల దయామయుని మధుర పరిమళము నాఘ్రాణించి, ఈ ఉచ్చారణామూలమును గ్రహియించిన యాతడు తన స్వీయనేత్రములతో శత్రుశూలములను స్వాగతించును, తద్వారా దైవశాసనముల సత్యమును మానవాళియందున సంస్థాపింపగలడు. వాని నాశ్రయించి, ‘ఆయన’ స్థిరనిర్ణయపు టాంతర్యమును గ్రహియింప గల్గినవానికి శుభమగు గాక !
కేశములైనను, జీవరహితములగు నస్తికలవంటివైనను నీ ప్రార్థనను భంగము గావింపనేరవు. బీవరు (మూషిక జాతికి చెందిన ఒక విధమైన జంతువు), ఉడుత, యింకను యితర జంతువుల యున్నిని మీరు ధరియింపవచ్చును. వీని యుపయోగముపై గల నిషేధము, ఖురాన్ నుండి కాక, మతాచార్యుల విపరీత వ్యాఖ్యల మూలమున వచ్చినది. నిశ్చయముగా, ‘ఆయన’ సకల మహిమాన్వితుడు, సర్వజ్ఞుడు.
యుక్తవయస్సారంభమైననాటి నుండి ప్రార్థన చేయుమని, ఉపవ సింపుమని మేము నిన్నాదేశించినాము; నీ ప్రభుడును, నీ పూర్వీకుల ప్రభుడును అగు భగవంతునిచే నిది నిర్దేశితమైనది. అనారోగ్యముచే, లేక వృద్ధాప్యముచే దుర్బలులైన వారిని ‘ఆయన’ తన సాన్నిధ్యానుగ్రహముగ, దీనినుండి మినహాయించినాడు; ‘ఆయన’ క్షమాదాత, దయాళువు. పరిశుభ్రమగు స్థానమెందైనను సాష్టాంగ ప్రణామము నొనర్చుటకు భగవంతుడు మీ కనుమతి ననుగ్రహించినాడు, ఏలయన ఇందుకు సంబంధించి దివ్య గ్రంథమునందేర్పరుపబడిన నియమమును మేము తొలగించినాము; మీరెరుగనిది, సత్యముగ భగవంతుని కవగతమే. శుద్ధీకరణకు జలము అలభ్యమైన యాతడు “పరమ పావనుడగు, పరమ పావనుడగు భగవంతుని దివ్యనామము పేరిట” యను పదముల నైదు పర్యాయములు పలికి, ఆపై తన ప్రార్థనాదికముల కుపక్రమింపవలె. సకల లోకాధిపతి యానతిట్టిది. దివారాత్రముల యవధి సుదీర్ఘముగ నుండు ప్రదేశములయందున గడియారముల, లేదా కాలగమనము నెరుకపరచు సాధనముల వలన ప్రార్థనా సమయములు తెలిసికొనబడు గాక. నిశ్చయముగ ఆయన ప్రదాత, వివేకి.
మీలో ప్రతి యొక్కరును వ్యక్తిగతముగా అనివార్య ప్రార్థనను చేయవలెనని నిర్దేశింపబడినది. దివంగతులకు నిర్దేశితమైన ప్రార్థనయందు తప్ప సామూహిక ప్రార్థనాచారము తొలగింపబడినది. సత్యముగ ‘ఆయన’ నిర్దేశకుడు, సకల వివేకి.
న్యాయాధీశుడగు భగవంతుని విశ్వసించు ప్రతియొక్కడును అను దినమును తన హస్తములను, ఆపై ముఖమును ప్రక్షాళనమొనరించుకుని, ఉపవిష్టుడై భగవంతుని వైపుకు తిరిగి “అల్లా ‘హో’ అభా” ను తొంబదియైదు పర్యాయములుచ్చరింపవలె. వైభవాధికారములతో తన దివ్యనామముల సింహాసనములపై నాసీనుడైనప్పుడు దివ్యలోకముల సృష్టికర్త యిచ్చిన యాదేశమట్టిది. అటులే, అనివార్య ప్రార్థనకై శుద్ధీకరణములను గావింపుడు; అతులితుడును, అప్రతిబంధితుడును అగు భగవంతుని యాదేశమిది.
హతమార్చుట లేక వ్యభిచరించుట, పరోక్షనింద, మిధ్యారోపణల యందు నిమగ్నులగుటనుండి మీరు నిషేధింపబడినారు; మరి, మీరు పవిత్ర గ్రంథములు, దివ్యఫలకములయందలి నిషిద్ధములను వర్జింపుడు.
మేము వారసత్వపుటాస్తిని ఈ రీతిగ సప్తవర్గములుగ విభజించినాము: ఐదువందల నలభై రెండు వాటాలు గల తొమ్మిది భాగములను పిల్లలకును; నాలుగు వందల ఎనభై వాటాలు గల ఎనిమిది భాగములను భార్యకును; నాలుగు వందల ఇరవై వాటాలు గల ఏడు భాగములను తండ్రికిని; మూడు వందల అరవై వాటాలు గల ఆరు భాగములను తల్లికిని; మూడు వందల వాటాలు లేదా ఐదు భాగములను సోదరులకును; రెండువందల నలభై వాటాలు లేదా నాలుగు భాగములను సోదరీమణులకును; నూట ఎనభై వాటాలు లేదా మూడు భాగములను ఉపాధ్యాయులకును కేటాయించినాము. నిశీధియందునను, ఉషఃకాలమునందునను మా దివ్యనామమును కొనియాడు నా యగ్రగామి శాసనమట్టిది. గర్భస్థశిశువుల యార్తనాదముల నాలకించినయంత, వారి వాటాను ద్విగుణీకృత మొనరించి, మిగిలినవారి వాటాలను తగ్గించినారము. సత్యముగా, ‘ఆయన’ కు తన యాకాంక్షానుసారము శాసించు శక్తి కలదు; ‘ఆయన’ తన సార్వభౌమాధికారముచే తన యిచ్ఛానుసారము వ్యవహరింప గలడు.
మృతునకు పిల్లలుండి, దివ్యగ్రంథమునందు పేర్కొనబడిన ఇతర ఔరసవర్గీయులెవ్వరును లేనియెడల, వారికి మూడింట రెండు వంతుల యాస్తి సంక్రమింపవలె; మిగిలిన మూడవ వంతు న్యాయమందిరమునకు మరలింప బడవలె. సకల సంపన్నుడును, సర్వోన్నతుడును అగు ‘ఆయన’ చే తేజో వైభవములతో నొసంగబడిన యాదేశమిట్టిది.
మృతునకు - బంధువులయందున అన్నదమ్ముల, అక్కచెల్లెండ్ర పిల్లలు దక్క పేర్కొనబడిన వారసులెవ్వరును లేనియెడల, వారసత్వపుటాస్తిలో వారికి మూడింట రెండు వంతులు చెందును; వీరు సైతము లేనియెడల, అది యాతని తల్లిదండ్రుల తోబుట్టువులకును, వారి యనంతరము వారి కుమారులకును, కుమార్తెలకును చెందును. మిగిలిన మూడవవంతు వారసత్వపుటాస్తి, ఏ పరిస్థితియందైనను, న్యాయసింహాసనమునకు మరలింపబడవలె. సర్వజన పాలకుడగు ఆయనచే దివ్యగ్రంథమునందీ రీతిగ నిర్దేశితమైనది.
మృతుడు జీవించియుండగనే, సంతానవంతుడగు ఆతని కుమారుడు దివంగతుడయ్యెనేని, భగవంతుని దివ్యగ్రంథ నిర్దేశితానుసారము ఆ సంతతి తమ తండ్రి వాటాకు వారసులగుదురు. పరిపూర్ణన్యాయముతో వారి వాటాను వారికి పంచియిండు. సమస్త మానవాధినాధునిచే నిర్ణీతములగు శాసన మౌక్తికములను వెదజల్లుచు, ఉచ్చారణోదధి పెనుకెరట మావిధముగ నువ్వెత్తున పైకెగసినది.
మృతుని పిల్లలు పసివారైనచో, వారసత్వపుటాస్తియందలి వారి వాటాను వారు యుక్తవయస్కులగునంత వరకు వారి పక్షమున వ్యాపారమునందో, వాణిజ్యమునందో మదుపుచేయుటకై ఒక విశ్వాసపాత్రునికి లేదా వాణిజ్యసంస్థకు అప్పగింపవలె. అట్లేర్పరుచుటచే దానికి సమకూరిన లాభమునందలి సముచిత వాటానొకదానిని, తద్ధర్మకర్తకు కేటాయింపవలె.
బహా సంఖ్యకు సరిపడునంతమంది సలహాదారులు గల ప్రతి నగరమునను న్యాయమందిరమొక్కటి స్థాపింపబడవలెనని, ఆ సంఖ్య అధికమైనను సరియేననియు భగవంతు డాదేశించినాడు; తామందు ప్రవేశించినపుడు, ఘనత వహించినవాడును, పరమోన్నతుడును అగు భగవంతుని సాన్నిధ్యమను సభాంగణమున కేగుచున్నటుల, అగోచరుడగు ‘ఆయన’ నవలోకింపుచున్నటుల వారు భావించుకొనవలె. మానవులయందున దయామయుని విశ్వాసపాత్రులుగ వ్యవహరించుటయును, సమస్త భూలోకవాసులకును దైవనిర్దేశిత మార్గదర్శకులుగ మెలగుటయును వారికి విధియింపబడినది. సంఘటితముగ సమాలోచనలను గావించుటయును, తమ స్వప్రయోజనములను గణియించినటులే, భగవంతునికై, ఆయన సేవకుల ప్రయోజనములను సైతము గణియింపుట యును, సయుక్తమూ, సముచితమూనగు దాని నెంచికొనుటయును వారికి అనివార్యమైయున్నది. సర్వాధిపతియగు మీ దైవము మిమ్మీవిధముగ నాజ్ఞాపించినాడు. విస్పష్టముగ ఆయన దివ్యఫలకమునం దావిష్కృతమైనట్టి దానినలక్ష్యమొనరింతురేమో, జాగ్రత్త. ఓ వివేకులారా, దైవభీతిని కలిగి యుండుడు.
మీలో స్తోమతగల వారు పవిత్రగృహమునకు తీర్ధయాత్రను గావింప వలెనని దేవాధిదేవు డాదేశించినాడు; ఆయన తన కారుణ్యము కొలది మహిళల నిందుండి మినహాయించినాడు. నిజమున కాయన సకలౌదార్యుడు, మహాదాత.
ఓ బహాజనులారా! ఏదో ఒక వృత్తి - అనగా కళ, వర్తకము లేదా తత్సమానమగు వ్యాసంగము - లో ప్రవేశించుట మీలో ప్రతియొక్కరికిని విధియుక్తము. మీరట్టి కార్యమునం దవలగ్ను లగుటను నిజదైవారాధన స్థాయికి సముద్ధరించినాము. ఓ ప్రజలారా! మీ దేవుని యనుగ్రహమును, ఆశీస్సులను స్మరియించుకొనుచు, ఉదయసాయంసంధ్యలయం దాయనకు ధన్యవాదముల నర్పింపుడు. నిర్వ్యాపారముతో, అలసత్వముతో మీ కాలమును వ్యర్థమొనరింపక మీకును, అన్యులకును ఫలదాయకమగు దానినొనరింపుడు. ఈ దివ్యఫలక దిఙ్మండలము నుండి వివేకోచ్చారణలనెడు ఉదయతార ప్రభవిల్లినది; ఇట్టి ఫలకమునుండి ఈ విధముగ నిర్దేశితమైనది. క్రియాశూన్యులై కూర్చుని, భిక్షాటనమొనరించువారు భగవంతుని దృష్టిలో పరమనీచులు. సాధనలనెడి రజ్జువును దృఢముగ చేబూని సర్వసాధనాప్రదాతయగు భగవంతునియెడ మీ విశ్వాసమును నిలిపియుంచుడు.
తన మనమునం దగ్రాసనము నపేక్షింపుచు ద్వారసీమ చెంతగల పాదరక్షల మధ్య ఆసీనుడైన వాడొకడు జనులయందు గలడు. వచించు: వాస్తవవిరుద్ధముగ నగుపించు ఓ యహంభావీ, అలక్ష్యపరుడా! ఎట్టి మనుష్యుడ వీవు? అంతర్జ్ఞ్ఞానకోవిదుడనని, ఇంకను నిగూఢ జ్ఞానమందు నిక్షిప్తమైయున్నదని చెప్పుకొనువాడును జనులయందే గలడు. వచించు: నీ వసత్య మాడుచున్నాడవు. దైవసాక్షిగా, నీయొద్దనున్నది - శునకములకు పారవైచిన శల్యములవోలె - నీకు మేము వైచిన తాలు తప్ప వేరొండు కాదు. ఏకైక నిజ దైవజ్ఞాన సాక్షిగా! ఎవ్వడైనను సర్వమానవ పాదప్రక్షాళన మొనరించినను, వనములయందునను, లోయలయందునను, పర్వతముల యందునను, ఉన్నత గిరులపైనను, మహోన్నత శిఖరములపైనను దైవము నారాధించినను, తదారాధనకు సాక్ష్యముగ ప్రతి శిలను, తరువును, మృత్శకలమును వదలక నిలిపినను, ఆతని నుండి మా సంప్రీతి పరిమళము లాఘ్రాణితములు కానేరవు, ఆతని కార్యములెన్నటికిని భగవంతుని యంగీకృతినొందజాలవు. సకలాధీశుడగు ‘ఆయన’ చే నివ్విధముగ నిర్దేశితమైనది. భరతఖండపు పర్వతసానువుల యందెందరు - న్యాయ బద్ధములని దైవము నిర్దేశించిన శాసనములకు దూరులై సర్వసంగ పరిత్యాగులై, కఠోర నియమములను విధియించుకొని, దివ్యపదావిష్కర్తయగు భగవంతుని స్మృతికి దూరులు కాలేదు. మీ విషయ వాంఛాసాధనకై మీ కార్యములను జాలములను గావింపవలదు; అంతియే కాక భగవత్సాన్నిధ్యమునందినవా రందరును అనవరతము పరితపించినయట్టి పరమోన్నత లక్ష్యమునకు మీరు దూరులు కావలదు. వచించు : నా సంప్రీతిని వడయుటయే సకల కార్యములకు జీవము; సర్వమును నాదగు యామోదము పైననే ఆధారపడి యుండును. సకల వైభవోపేతుడును, సర్వౌదార్యుడును అగు భగవంతుని దివ్యగ్రంథముల యందేమున్నదో తెలిసికొనవచ్చును గాన మా ఫలకములను పఠియింపుడు. నా ప్రీతికి పాత్రుడైనవాడు, స్వర్ణాసనమునకును, సకల ప్రపంచ గౌరవమునకును అర్హుడగును; తత్ప్రీతి విహీనుడు ధూళిపై నాసీనుడైనను, ఆ ధూళి సైతము సకల మతాధీశుడగు భగవంతుని శరణువేడును.
సహస్రవర్షముల పరిపూర్తికి పూర్వమే భగవదావిష్కరణకర్తగా ప్రకటించుకొనువాడు నిక్కముగ వంచకుడు. అట్టి ప్రకటనను ఉపసంహరించు కొనుటకును, పరిత్యజించుటకును ఔదార్యముతో నాతడికి తోడ్పడుమని మేము భగవంతుని వేడుచున్నాము. ఆతడు పశ్చాత్తాపము నొందెనేని, పరమాత్ముడు నిస్సంశయముగా మన్నించును. అయితే ఆతడు మూర్ఖత్వముకొలది తన పట్టును వీడనిచో, ఆతనియెడ నిర్దాక్షిణ్యముగ వ్యవహరించు నాతనిని భగవంతుడు నిశ్చయముగ పంపగలడు. శిక్షించుటయందు భగవంతుడు యదార్థముగ చండప్రచండుడు! ఈ ప్రవచనమును - దీని విస్పష్టార్థమునకు విరుద్ధముగ - వ్యాఖ్యానించు నాతడు, సమస్త జీవకోటిని యావరించిన దైవతేజస్సునకును, ‘ఆయన’ కరుణకును పాత్రుడు కాజాలడు. దైవభీతిని కలిగియుండుడు, మీ వ్యర్ధభ్రమల ననుసరింప వలదు. సర్వశక్తివంతుడును, సకల వివేకియును యగు మీ పరమాత్ముని యాజ్ఞను పాలింపుడు. అనేక ప్రదేశములయం దచిరకాలములోనే ధిక్కారస్వరములు వెలువడును. ఓ నా జనులారా! మరి, పాపాత్ములను, దుస్స్వభావులను అనుసరింపవలదు. ఇరాక్ నందు వసియించునప్పుడును, మరి ఆపై మార్మికభూమి(అడ్రియానోపుల్) యందుండగను మేము మీకు ముందుగా హెచ్చరిక చేసినదియును, ఇప్పుడీ దేదీప్యమానస్థలి నుండి హెచ్చరింపుచున్నదియును ఇదియే.
ఓ జగజ్జనులారా! నా సౌందర్యప్రభాతనక్షత్ర మస్తమించినప్పుడు, నా స్వర్గధామము మీ నేత్రముల కగోచరమొనరింపబడినప్పుడు వెఱపునొందవలదు. నా దివ్యధర్మపురోగతికిని, మానవులయందున నా ప్రవచనోద్ధతికిని ఉద్య మింపుడు. మేము సర్వదా మీతో నుందుము, సత్యబలముచే మిమ్ము శక్తి వంతులనొనరింతుము. సత్యముగా మేము సర్వశక్తివంతులము. నన్ను గుర్తించిన యాతడు, భూస్వర్గ శక్తులు సైతము తన యుద్దేశ్యమును నిరోధింప జాలనంతటి దృఢసంకల్పముతో నన్ను సేవించుట కుద్యుక్తుడగును.
ప్రపంచజనులు గాఢనిద్రావస్థయందున్నారు. వారు తమ సుషుప్తి నుండి మేల్కాంచిరేని సర్వజ్ఞుడును, సర్వవివేకియును అగు భగవంతుని దెసకు ఆత్రమున పరువిడుదురు. తమ ప్రభుడు తమనుద్దేశించి కేవలమొక్క పదము నుచ్చరించు నటుల గుర్తుంచుకొనుటకై తమ సర్వమును - అది భూమి పైనున్న సకలసంపదలైనను - పరిత్యజింతురు. సమస్త జ్ఞానమును నికిప్తమైనట్టిదియును, సృష్టినేత్రము గాంచియుండనిదియును, సాక్షాత్త్తు తనకుతప్ప అన్యులకు అనావిష్కృతమును అగు దివ్యఫలకమున సర్వశక్తివంతుడు, సకల జగద్రక్షకుడు యిచ్చిన యాదేశమిట్టిది. తమ దుర్వాంఛల మైకమున వారెంతటి విభ్రమము నందుండిరనిన “పరాక్రమశాలిని, సకలవివేకిని యగు నేనుతప్ప అన్యదైవము లే”డని వారి ప్రభునివాణి అన్ని వైపులనుండియు యెలుగెత్తి పిలచినను గ్రహియించుట కశక్తులైనారు.
వచించు: మీ యాధీనమందలి వస్తుసంచయము పట్ల మురియ వలదు, ఈ రేయికవి మీవి, రేపటికవి పరుల పాలగును. సర్వజ్ఞుడును, సకల విదుడును అగు ‘ఆయన’ మిమ్మీవిధముగ హెచ్చరింపుచున్నాడు. వచించు: మీ స్వాధీనమందున్నది శాశ్వతమని, సుభద్రమని యనగలరా? లేదు! సకలదయాళువునగు నా సాక్షిగా, న్యాయబద్ధముగ నిర్ణయించు వారలైనచో, అనలేరు. మీ జీవితకాలము, ప్రాణవాయువు వోలె కరగిపోవును, మీకు ముందు చనిన వారి కీర్తివైభవముల వోలె మీ కీర్తివైభవములును అంతరించును. ఓ జనులారా! యోచింపుడు మీ గతించిన దినములకు, శతాబ్దముల కేమైనది? దైవస్మరణకు అంకితములైన దినములు ఆనందదాయకములు, సకల వివేకియగు ‘ఆయన’ ను స్తుతించుటకు వెచ్చించిన ఘడియలు శుభప్రదాయినులు. నా జీవితము సాక్షిగా ! బలవంతుల యాడంబరము గాని, సంపన్నుల సంపద గాని, దుష్టుల ప్రాబల్యము గాని నిలువబోవు. ‘ఆయన’ నుండి వెలువడు ఏకైక వాక్కుతో సర్వమును నశించును. నిశ్చయముగా ‘ఆయన’ సర్వాధికార పరిపూర్ణుడు, సమస్తప్రేరణకర్త , సర్వశక్తివంతుడు. మానవులు సమకూర్చుకొను భౌమవస్తువుల వలన ప్రయోజనమేమి? వారు తమకు ప్రయోజనకరమగు దానిని పూర్తిగా నలక్ష్యము గావించినారు. అనతికాలమునకే వారు తమ గాఢనిద్రనుండి మేల్కాంతురు; సర్వశక్తివంతుడును, సమస్త శ్లాఘనీయుడును అగు తమ ఈశుని జీవితకాలములో తమకు దక్కియుండని దానినిక పొందలేమని తెలిసికొందురు. వారికి తెలిసి యుండెనేని, ‘ఆయన’ సింహాసన సమక్షమున తమ నామప్రస్తావనకైై సమస్తమును పరిత్యజించియుండెడి వారు. నిశ్చయముగా, వారు మృతసదృశులు.
పాండిత్యముచే గర్వమునొంది, స్వయమాధారుడనగు నా దివ్య నామమును గుర్తించుట నుండి తిరస్కరింపబడినవాడై, తనను వెన్నంటివచ్చు పాదరక్షల సవ్వడిని వినినంతనే స్వీయౌన్నత్యమున నిమ్రోదుకన్న తానే యధికుడనని అహంకరించునాతడు జనబాహుళ్యమున కలడు. ఓయి తిరస్కృతుడా! ఇప్పుడాతని యావాసమెక్కడ? దైవసాక్షిగా, అధోలోకాగ్ని యది. వచించు : ఓ దివ్యజ్ఞానుల సముదాయమా! నా పరమోన్నతలేఖిని చేయు తీవ్ర ధ్వని నాలకింపలేకున్నారా? సమస్త కీర్తి దిఙ్మండలోపరితలమున ఈ భానుడు దేదీప్యమానముగ శోభిల్లుటను కాంచలేకున్నారా? మీ దుష్ట మనోవికార ప్రతిమల నింకెంత కాలమారాధింతురు? మీ శుష్కభ్రమలను వీడి అనంతజీవనుడగు మీ భగవంతుని దెస కభిముఖులు కండు.
ధర్మకార్యార్ధమై యర్పించిన దానధర్మములు సంకేతములకర్తయగు భగవంతునికే చెందును. ఆవిష్కరణకు అరుణోదయస్థానమగు ‘ఆయన’ యానతిలేనిదే దానిని వినియోగించు హక్కెవ్వరికిని లేదు. ‘ఆయన’ యనంతరము అఘ్సాన్‌కును, ఆపై న్యాయమందిరమునకును ఈయధికార మబ్బును. ఈ ప్రపంచము నందది స్థాపితమైనప్పుడు వారీ దానధర్మములను ఈ దివ్యధర్మపరముగ నౌన్నత్యమునొందిన ప్రదేశములయందున శక్త్యధికారాధి నాధుడు తమకు నిర్దేశించిన దానికై వినియోగింపవచ్చును. అట్లు కాదేని, ‘ఆయన’ ఆజ్ఞ లేనిదే మాట్లాడనివారు, ‘ఆయన’ ఫలకమునందు నిర్దేశింపబడిన దాని ననుసరించి తప్ప వేరు తీర్మానించని బహాజనులకు, ఈ దేవాదాయములు మరలింపబడును. అదిగో చూడుడు, వారు భూ స్వర్గముల మధ్య విజయాగ్రేసరులు. శక్తివంతుడును, ఔదార్యుడును అగు భగవంతునిచే దివ్యగ్రంథమునందు పొందుపరచబడినటుల వారు దానిని వినియోగింప వచ్చును.
పరీక్షాసమయమున పరితాపమునొందక, సంబరపడక, ఆపత్కా లమున నన్ను స్మరియించుట, భవిష్యత్తులో మీకు సంభవింపనున్నదాని గురించి యోచించుట యను మధ్యేమార్గము నెంచికొనుడు. సమస్తజ్ఞాని, సకలమును ఎరిగినట్టి ఆయన* - ఈ విధముగా తెలుపుచున్నాడు.
పఠన, లేఖన కళను, భగవంతుని పవిత్ర దివ్యఫలక నిర్దేశితము నంతటిని తన కుమారునికిని, కుమార్తెకును నేర్పింపవలసిన బాధ్యత ప్రతి తండ్రికిని విధియింపబడినది. తనకాజ్ఞాపితమైనట్టి దానిని త్రోసిపుచ్చిన వాని నుండి - ఆతడు సంపన్నుడైనచో - వారి విద్యాబోధన కవసరమగు ధనమును దివ్య ధర్మకర్తలు రాబట్టుకొనవలె; ఆతడు సంపన్నుడు కాడేని, న్యాయమందిరమే ఆ బాధ్యతను వహియింపవలసి యుండును. నిశ్చయముగా, దానిని మేము నిరుపేదలకును, ఆర్తులకును ఆశ్రయము గావించినారము. తన కుమారుని లేదా అన్యుని కుమారుని వృద్ధిలోకి తెచ్చిన, అది నా తనయుని వృద్ధిలోనికి తెచ్చినయట్లే యగును. అట్టి వానికి, లోకావృతమగు నా వైభవమును, నా ప్రేమాన్వితానుగ్రహమును, నా కారుణ్యమును ఉపలబ్ధములగును.
సజీవమగు ఈ విమలోదక దివ్యస్రవంతి నుండి మీ వంతునొంద నీయక విభవపు తెఱలు - మిమ్ము నిరోధించేను జాగ్రత్త. అరుణోదయ కారకుడగు ఆయన పేరిట మోక్షకలశము నందుకొని, సకల మహిమాన్వితు డును, ఉపమానరహితుడును అగు ఆయనను సంకీర్తింపుచు, మెండుగా గ్రోలుడు.
సకల అపరాధశుల్కముల యందలి తృతీయ భాగము న్యాయ సింహాసనమునకు చెందవలెనని మేమాదేశించినాము; అట్టి సంచితమును - సకల వివేకియును, సర్వజ్ఞుడును అగు ‘ఆయన’ తమకు విధియించిన కార్యముల నిమిత్తము వెచ్చించుటయందున పూర్తిన్యాయమును పాటింపవలెనని దాని సభ్యులకు ప్రబోధింపుచున్నాము. ఓ న్యాయపురుషులారా! మీరు మీ కొమరులను కాపాడుకొనునటుల, భగవంతుని దివ్యధామమునం దాయన గొఱ్ఱెలకు సంరక్షకులు కండు; ప్రచ్ఛన్నములై యాకలిగొనియున్న తోడేండ్ల నుండి వానిని రక్షింపుడు. దివ్యోపదేశకుడు, విశ్వసనీయుడు మీకిటుల ఉద్బోధింపుచున్నాడు.
ఏ యంశము గురించి యైనను మీలో విభేదములు తలయెత్తెనేని, వానిని యీ దివ్యస్వర్గపు నభోమండలముపై సత్యసూర్యుడింకను ప్రకాశింపు చుండగనే భగవంతునికి నివేదింపుడు; తత్సూర్యుడస్తమించినప్పుడు ఆయనచే ననుగ్రహీతమైనట్టి దానికి నివేదింపుడు. నిశ్చయముగ నిది సమస్త ప్రపంచ జనులకును సముచితమైనది. వచించు : ఓ ప్రజలారా ! నా ప్రత్యక్షతావైభవ మంతరించినపుడు, నా యుచ్చారణాసాగరము స్తబ్ధతనొందినపుడు మీ హృదయములను కలవరమొందనీయకుడు. మీ మధ్యనగల నా యుపస్థితి యందొక వివేకమున్నది; తుల్యరహితుడును, సర్వజ్ఞుడును అగు భగవంతునికి దక్క అన్యుల కర్థముగానట్టి దింకొక్కటి నా యనుపస్థితి యందున్నది. మేము మా దివ్యవైభవధామము నుండి నిశ్చయముగ, మిమ్మవలోకింతుము; మా దివ్యధర్మ విజయమున కుద్యమించు వారికి మా దివ్యగణాతిథేయులతో, మా యనుగ్రహమునొందిన దేవదూతలతో సాహాయ్యము గావింప జేయుదుము.
సకల కీర్తివంతుడగు మీ ప్రభుడు ఎట్టి మహోన్నత సీమల నుండి పిలుచుచున్నాడో యెఱుగుదురా? సకల నామాధిపతియగు మీ సర్వేశ్వరుడు దేనితో మిమ్ము శాసింపుచున్నాడో ఆ దివ్యలేఖినిని గుర్తించితిమని భావింపు చుంటిరా? లేదు, నా జీవితముపై యాన! దీనిని మీరెరిగియుంటిరేని ఈ జగమును త్యజియించి, హృదయపూర్వకముగ దివ్యప్రియతముని సమక్షమునకు వేగిరపడి యుండెడువారు. ఘనతరమగు జగమును సంక్షోభములో పడద్రోయు నటుల మీ యాత్మలు ‘ఆయన’ వాక్కునకు పరవశించెడివి, ఇక ఈ యల్పప్రపంచ మెంత ! నా యనుగ్రహమునకు ప్రతీకగా, నా ప్రేమాన్విత కారుణ్య ధామము నుండి నా యౌదార్యతుషారములు మీరు కృతజ్ఞులగునటుల భువిపై వర్షించినవి.
దైహికములును, నీతిబాహ్యములును అగు వాంఛలు, మీ యందున విభేదములను రేకెత్తించునేమో జాగరూకులు కండు. ఒకే హస్తపుటంగుళుల వలె, ఒకే దేహపుటంగముల వలె ప్రవర్తిల్లుడు. మీరు విశ్వసింతురని, దివ్యావిష్కరణాలేఖిని మీకీ విధముగ నుపదేశింపుచున్నది.
భగవంతుని సౌహార్ద్రమును, ‘ఆయన’ పురస్కారములను గణియింపుడు. ఆయన సమస్త ప్రాణులను తానై త్యజియింప జాలినను మీకు లబ్ధినొసంగు వానిని మీకు విధియించినాడు. మీ దుష్కార్యములు మాకెన్నడును హానిని కలిగింపజాలవు; అట్లని, మీ సత్కార్యములు మాకు లబ్ధినీ చేకూర్చవు. కేవలము పరమాత్ముని కొరకే మిమ్మాహ్వానింపుచున్నారము. అవగాహనా పరుడును, అంతర్దృష్టి యుతుడునునగు ప్రతి మనుష్యుడును యిందుకు సాక్షీభూతుడే.
పరమేశ్వరుడు మీకు వివాహమును నిర్దేశించినాడు. ఇరువురుకన్న ఎక్కువమంది భార్యలను వివాహమాడుదురేమో, జాగ్రత్త. ఎవ్వడైనను భగవంతుని పరిచారికలయందొక్కరిని జీవిత భాగస్వామిగా పరిగ్రహించి సంతుష్టి నొందెనేని ఆతడు, ఆమె - యిరువురును సామరస్యముతో జీవింతురు. తన సేవకై యొక సేవికను గైకొను నాతడు సముచితరీతిన వర్తింపవలె. సత్యముగ, న్యాయముగ దివ్యావిష్కరణాలేఖినిచే పొందుపరుపబడిన నిర్దేశమిట్టిది. నా సేవకుల యందున నన్ను స్మరియించువానికి జన్మమునీయవచ్చును కనుక, ఓ మానవులారా ! వివాహితులు కండు. మీకిది నాయానతి; మీకు సహాయకారి యగుటకై దీనిని స్థైర్యముతో పాలింపుడు.
వివాహము ఉభయపక్షముల సమ్మతిపై నాధారపడి యుండునని బయాన్ నందు పేర్కొనబడినది. మా సేవకుల యందున ప్రేమ, ఐక్యత, సామరస్యములను కలిగింపనెంచి, వారి మధ్య వైరమును, విద్వేషమును తల యెత్తునేమోనని, వివాహమాడనెంచిన జంట యభీష్టము తెలిసినతోడనే, అది వారి జననీజనకుల సమ్మతిన జరుగవలెనని మేము నియమబద్ధము గావించి నాము. మాకిందు వేరు ఉద్దేశ్యములును కలవు. మా యాదేశ మీవిధముగ నిర్దేశితమైనది.
భార్యాభర్తల మధ్య రోషద్వేషములు తలయెత్తెనేని, యాతడామెకు విడాకులనీయక ఒక సంవత్సరకాలము ఓరిమిని వహియింపవలె, ఏలయన, బహుశః వారియందనురాగ సౌరభములు పునఃపరిమళింవ వచ్చును. ఒకవేళ ఈ వ్యవధి పూర్తయి, వారి మధ్య ప్రేమ పునరుజ్జీవము నొందనిచో విడాకులు చోటుచేసుకొనుట విధాయకమే. నిక్కముగా, భగవద్వివేకము సమస్త వస్తు జాలమును ఆవరించినది. మీరు ముమ్మారు పలికి స్త్రీకి విడాకులనిచ్చు పూర్వ విధానము నవలంబించుటను పరమాత్ముడు తన తన యాజ్ఞాలేఖినిచే లిఖియింప బడిన యొక ఫలకమునందు నిషేధించినాడు. మీరు కృతజ్ఞులుగా పరిగణింప బడవలెనని, ఆయన తన పరముగ అనుగ్రహించినట్టిదిది. ఒక్కొక్క మాసము గడచుకొలది పరస్పరానురాగమును, అభీష్టమును ఒనగూడి నపుడు, విడాకులిడిన వాడు తన యర్ధాంగిని, ఆమె వేరెవ్వరినీ మనువాడియుండనిచో, పునరుద్వాహమగుటకు నిర్ణయించుకొనవచ్చును. ఆమె మరల వివాహిత కాకపోయిన పక్షముననూ, ఆమె పరిస్థితి మారనట్లు స్పష్టమైననూ తప్ప, ఈ నవ్యసమాగమముతో వియోగము నిర్ధారణయై విషయము ముగిసిపోవును. దివ్యసౌందర్యోదయ స్థానమగు ఆయనచే, రాజసముట్టిపడ, ఈ మహిమాన్విత ఫలకమునం దీవిధముగ తీర్మానము లిఖియింపబడినది.
భార్య భర్తననుసరించి ప్రయాణించునప్పుడు దారిలో వారి మధ్య విభేదములు తలయెత్తెనేని ఆమెకొక సంపూర్ణ వత్సరము వ్యయములకు ధనము నాతడేర్పరుపవలసి యుండును; ఇంకను, ఆమెను వచ్చినచోటికి పంపివేయవలె, లేనిచో నామె ప్రయాణమునకు వలయు ఏర్పాట్లన్నియు చేసి ఒక విశ్వసనీయుని తోడిచ్చి గృహమున కంపవలె. మీ ఈశుడు, యదార్ధముగా, భూజనులందరినీ ఆవరించినయట్టి సార్వభౌమాధికారముతో తన యభీష్టానుసారము ఆదేశించును.
స్త్రీ, లేక పురుష బానిసల వ్యాపారము చేయుట మీకు నిషేధించ బడినది. తానే సేవకుడైయుండిన వానికి భగవంతుని సేవకుల క్రయము తగనిది. ఆయన పవిత్ర ఫలకమునందిది నిషేధ్ధము. ఆయన కారుణ్యముకొలది న్యాయలేఖినిచే ఈ రీతిగ యాజ్ఞ లిఖియింపబడినది. ఎవ్వడును ఇంకొకనిపై యాధిక్యతను వహియింపకుండు గాక; అందరును భగవంతుని యెదుట కట్టు బానిసలే; అంతియేకాక, ఆయన తప్ప అన్యదైవము లేడను సత్యము నెల్లరును సోదాహరణముగ చాటుదురు. సత్యముగా, ఆయన సమస్తవిజ్ఞాని; ఆయన విజ్ఞానము సర్వావృతము.
ఆ ప్రకారముగ, భగవంతుడు తన యౌదార్యసమక్షము నుండి వెలువడిన యనుగ్రహముగ, వివిధాంశములకును, జనులకును అశుచిని ఆపాదింపుచున్న “మలినత్వ” భావన నుద్వాసించినాడు. నిశ్చయముగా, ‘ఆయన’ సదా క్షమాశీలి, మహోదారుడు. సత్యముగా, మేము మా మహోత్కృష్టనామముల, మా విశేషస్వభావముల శోభలను సమస్త జగముపైనను భాసిల్లజేసిన నాటి, రిద్వాన్ ప్రథమ దివసమున, సమస్తసృష్టియును విమలాంబుధి యందున స్నానమాడినది. సమస్తభువనావృతమగు నా దయానుగ్రహమునకిది యదార్ధముగ నొక సంకేతము. మరి, సర్వమతస్థులతోడను సన్నిహితముగ వ్యవహరింపుడు; పరమకరుణాళువగు మీ యమరేశుని దివ్యధర్మము నెలుగెత్తి చాటుడు; అవగాహనా పరులైనచో సకల కార్యములకును మకుటాయమాన మిదియేనని యెరుంగుడు.
ధూళిచే మలినమైన దానిని ప్రక్షాళనచేయవలెననుచు, సంపూర్ణ పరిశుభ్రతావలంబనను పరంధాముడు మీకు నిర్దేశించియుండ, ఇక పేరుకు పోయిన మురికిని, తత్సదృశ మాలిన్యమును గురించి వేరుగ చెప్ప నవసరము లేదు. దైవభీతిని కలిగి, పరిశుభ్రదేహులు కండు. ఎవ్వని వస్త్రమైనను మురికిగనున్నట్లగుపించినచో నాతని ప్రార్థనలు భగవంతుని దరి చేరజాలవు. ఉత్కృష్ట దేవగణము లాతనినుండి దూరముగ వైదొలగిపోవును. గులాబీజలమును, స్వచ్ఛములగు సుగంధద్రవ్యములను వినియోగింపుడు; తుల్య రహితుడును, సకల వివేకియును అగు మీ దేవదేవుడు వాస్తవమునకు వాంఛించినది మీ నుండి పరిమళింపవలెనని భగవంతు డనాదిగ నాశింపు చున్నాడు.
మీరన్యులకై సంగ్రహించియుంచిన దానియెడ మీరానంద పరవశు లగుటను, నా నిక్షిప్తఫలకము దక్క అన్యమెద్దియును గణుతింపలేని లోకముల నుండి మిమ్ముమీరు దూరముగావించు కొనుటను మేమవేక్షింపు చున్నాము. మీరు సమీకరించుకొనిన సంపదలు మీ పరమలక్ష్యము నుండి మిమ్ము బహుదూరమున కాకర్షించినవి. ఈ రుగ్మత మీకు సముచిత మైనదేనని గ్రహియింపుడు. ఐహికములగు సకల మాలిన్యములను మీ మనస్సులనుండి క్షాళన మొనరింపుడు; సర్వమును త్యజియించి నిక్షిప్తఫలక నిర్దేశితమును పాటించిన వారిని దక్క తక్కిన ప్రపంచమును ప్రకంపింపజేసి, సమస్త జనులను శోకతప్తులనొనరించిన భూలోకసువర్లోకస్రష్టయగు మీ భగవంతుని సామ్రాజ్యమున కేగుటకు త్వరనొందుడు.
ఓ మహీపతులారా ! ఈ స్థానమున, భావాతీతప్రభాస్థలియగు ఇప్ర్పదేశమున మహోన్నత శాసన మావిష్కృతమైనది. చంద్రు డెవ్వరిచే ఛిద్రము గావింపబడెనో, అప్రతిహతమగు ప్రతి తీర్మానమును ఎవ్వరిచే విశదీకృతమైనదో, తుదిఘడియల నెవ్వరారంభించిరో ఆ పరమ నిర్దేశకుని యిచ్ఛామూలమున ప్రతి నిక్షిప్త విషయమును వెలుగులోనికి తేబడినది.
ఓ రాజన్యులారా ! మీరు సామంతులు మాత్రమే. తన మహాద్భుత కీర్తితో కొలువై, సంకటహరుడును, స్వయంభువును అగు తన చెంతకు మిమ్మాహ్వానింపుచు, రాజాధిరాజగు ‘ఆయన’ ప్రత్యక్ష మైనాడు. దివ్యావిష్కరణా మూలము నెరుగుటలో మీ యహంకారము మిమ్ము నిరోధించేను జాగ్రత్త; స్వర్గస్రష్టయగు ‘ఆయన’ నుండి మిమ్ము ప్రాపంచికవిషయములు తెరలవోలె త్రోసివేయునేమో జాగరూకులు కండు. సమస్త జాతుల ఆకాంక్షయును, మిమ్ము తన ఏకైకవాక్కుచే సృజించి, తన సార్వభౌమత్వమునకు శాశ్వత ప్రతీకలు గావించిన ‘ఆయన’ ను సేవించుట కుద్యుక్తులు కండు.
ఓ ఆస్ట్రియా చక్రవర్తీ: నీవు అఖ్సా మసీదు సందర్శనార్థమై వెడలినప్పుడు, భగవజ్జ్యోతిఃప్రత్యూషమగు ‘ఆయన’ అక్కా కారాగారవాసిగ నున్నాడు. నీవాయనను గమనింపవైతివి, ప్రతి గృహమును మహోన్నత మొనరించి, ప్రతి ఘనద్వారమును వివృత మొనరించినయట్టి ఆయనను గురించి విచారణ సైతము గావింపవైతివి. నిశ్చయముగ, మేమీ తావును సకల జగమును ఆశ్రయించునటుల, జగజ్జనులు నన్ను స్మరియింపునటు లొనరించినాము; అయినను, ఈ యారాధనకు పరమావధియగు ‘ఆయన’ - నీ ప్రభుడును, సకలలోకాధీశుడును అయిన భగవంతుని దివ్యసామ్రాజ్యముతోకూడి ప్రత్యక్ష మైనపుడు, ‘ఆయన’ ను విస్మరించినాడవీవు. మేము సదా నీతోడ నుండి, నీవు అలక్ష్యమూలమును, దాని శాఖను అంటిపెట్టుకుని యుండుటను గాంచితిమి. నా వచనములకు నీ దైవమే సాక్షి. మేము నీ ఎదుటనుండినను, మమ్మెఱుగక, మా నామము చుట్టును పరిభ్రమింప జూచి దుఃఖితులమైతిమి. నీ నేత్రములను దెరువుము, తద్వారా - ఈ మహోజ్జ్వల దృశ్యము నవలోకించి, దివారాత్రములును నీవారాధించునట్టి ‘ఆయన’ ను చూడవచ్చును; ఉజ్జ్వల దిఙ్మండలముపై శోభిల్లు దివ్యజ్యోతిని గాంచవచ్చును.
మేము మిమ్మర్ధించిన దేమియు లేదు. ఓ రాజసముదాయమా ! మాకు మీ మూలమున సంభవించిన దానిని సత్యముగా, భగవంతుని కొఱకు మేమెటుల సైరించితిమో, నటులే సహిష్ణులై యుండవలెనని యుద్బోధింపు చున్నాము.
ఓ రైన్ నదీతీరములారా! దండనా ఖడ్గములు మీపై దూయబడుటచే రక్తసిక్తములైన మిమ్మవలోకించినాము; అయినను, మీకింకొక యవకాశమున్నది. బెర్లిన్ నేడు పూర్ణవైభవముతోనున్నను దాని యాక్రందనలు మాకు విననగుచున్నవి.
అచిరకాలమునకే, నీ యంతర్గత వ్యవహారముల స్థితి మారి, అధికార పగ్గాలు ప్రజల చేతికి రాగలవు. సత్యమునకు, నీ దైవము సర్వజ్ఞుడు. ఆయన యధికారము సమస్త వస్తువులను ఆవరించియున్నది. నీ ప్రభుని దయానుగ్రహములను విశ్వసింపుము. ప్రేమోపేతమగు దయాదృష్టి నీపైననే కేంద్రీకృతమై యుండును. నీ యావేదన, ప్రశాంతతగ, పరిపూర్ణశాంతిగ మార్పునొందు దినము రానైయున్నది. అద్భుతమగు దివ్యగ్రంథమునందీ విధముగ నిర్దేశితమైనది.
ఓ ఖా(ఖురాసాన్) ప్రదేశమా! సకల సంపన్నుడును, మహోన్నతుడును అగు నీ దైవమును ఘనరీతిన శ్లాఘించుటకుద్యుక్తులైన మహావీరుల వాణి నీ నుండి మాకు విననగుచున్నది. సకల మహిమాన్వితుడనగు నా దివ్యనామమున, సృష్టిసామ్రాజ్యమునందు దివ్యనామ ధ్వజారోహణము జరుగు దినము శుభదాయకము. విశ్వాసులు ఆ దినమున దైవవిజయమునకు మోదమొంద, అవిశ్వాసులు ఖేదమొందుదురు.
ఓ మహాశక్తిసమన్విత పయోనిధీ! దివ్యసార్వభౌమత్వమగు ‘ఆయన’ చే నీకనుగ్రహీతమైన దానిని దేశములపై సంప్రోక్షించి, ‘ఆయన’ న్యాయవస్త్రముతో సకల భూలోకవాసుల ఫాలములను అలంకరింపుము, తద్వారా సమస్త హృదయములును సంతసిల్లును, సకల నేత్రములును మిన్నగా మెరయును.
. ఎవ్వడేని శతమిష్కల్‌ల స్వర్ణము నార్జించినచో, అందలి పంధొమ్మిది మిష్కల్‌లు, భూస్వర్గముల స్రష్టయగు భగవంతునివి; ‘ఆయన’ కు సమర్పింపవలసినవి. ఓ జనులారా! ఇంతటి మహావదాన్యతను మీరు కోల్పోవుదురేమో, అప్రమత్తులు కండు. మేము మీతోడను, సమస్త భూస్వర్గ వాసుల తోడను వ్యవహరింప సర్వసమర్ధులమైనను, మిమ్ముల నీవిధముగ నాదేశించినాము; సర్వజ్ఞుడును, సమస్తము నెరిగినవాడును అగు భగవంతునికి దక్క, అన్యుని స్ఫురణకందని ప్రతిఫలములును, వివేకములును ఇందు గలవు. వచించు : ఈ విధముగ మీయార్జనలను పునీతమొనరించుటకును, మిమ్ములను భగవదేచ్ఛాపాత్రులకు దక్క అన్యుల యవగాహనకందని స్థానముల నందుకొన సమర్ధుల నొనరించుటకును ఆయన ఆకాంక్షించినాడు. సత్యమునకు! ఆయన ఉపకారి, ఉదారుడు, ప్రదాత. ఓ ప్రజలారా! భగవంతుని హక్కు యెడ అవిశ్వాసముతో వర్తింపనూ వలదు, ఆయన యనుజ్ఞ లేనిదే యధేచ్ఛగా దానిని వినియోగింపనూ వలదు. పావన ఫలకములయందున, ఈ పరమోన్నత గ్రంథము నందున ఆయన యాదేశ మివ్విధముగ నిర్ధారితమైనది. భగవంతునితో నవిశ్వాసముతో వ్యవహరించు నాతడు, తానును అవిశ్వాసమునకే గురియగును. భగవదాజ్ఞానుసారము వర్తించునాతడు - ఔదార్యుడును, వరప్రదాతయును, దాతయును, దినప్రాచీనుడును అగు తన ప్రభుని వదాన్యతా స్వర్గము నుండి ఆశీర్వచనము నొందును. నిక్కముగా, ‘ఆయన’ మీకై మీ జ్ఞానమునకు అతీతమైనదానినే, ఈ క్షణభంగుర జీవితానంతరము మీ యాత్మలు స్వర్గము దెసకు సముద్గమించి, మీ యైహికానంద బంధనములు భగ్నమైనపుడు మీకు గ్రాహ్యమగునట్టి దానినే ఆశించినాడు. దివ్యనిక్షిప్త ఫలకము నొందియున్న ‘ఆయన’ మిమ్ముల నీవిధముగ హెచ్చరింపుచున్నాడు.
వచించు: ఓ మతాధిపతులారా! మీ వర్తమాన ప్రమాణములతోడను, విజ్ఞానముతోడను భగవంతుని దివ్యగ్రంథమును ప్రామాణీకరింపవలదు; ఏలయన, ఆ గ్రంథమే మానవులయందేర్పరుపబడిన దోషరహిత మగు త్రాసు. మానవులును, వారి సంతతియును తమ స్వాధీనమందలి దేనినైనను, నిర్దుష్టమగు ఈ దివ్య తులతో కొలువవలసినదేననియు, దాని భారము తత్ప్రమాణానుసారమే పరీక్షింపబడవలెననియు తెలియుడు.
ఓ మతనేతలారా! దార్శనికతయందున గాని, బుద్ధికుశలత యందున గాని మీలో నన్నెదిరించు వాడెవ్వడు? వాగ్పటిమయందున గాని, వివేకమున గాని నాకు సమయుజ్జీనని చెప్పుకొనువాడెందు కానవచ్చును? సమస్త దయాళువగు నా దైవము సాక్షిగా! లేడు; వసుధయందలి సమస్తమును సమసి పోవును; శక్తివంతుడును, పరమప్రియుడును అగు మీ భగవంతుని వదన మిదియే.
జనులారా! సమస్త విజ్ఞానమునకును మూలాధారుడగు ఆయనను తెలియుటయే సకలవిజ్ఞానార్జనకును పరమోన్నత పరమావధి యని మేము నిర్దేశించినాము; అయినను, ఈ దివ్యజ్యోతికి ప్రత్యూషమును, ప్రతి గుప్త విషయావిష్కర్తయును అగు ‘ఆయన’ నుండి మీ విజ్ఞానము తెరయై మిమ్మెటుల తొలగద్రోచినదో యవలోకింపుడు. ఈ విరళీకృత వాక్ప్రభా మూలము నెరిగితిరేని, మీరీ జగమందలి జనులను, వారి యాధీనమందలి సర్వమును త్రోసిపుచ్చి ఈ పావన మహాన్వితపీఠ సామీప్యమున కేతెంతురు.
మీ తండ్రుల పత్నులను పరిణయమాడుట మీకు నిషేధింపబడినది. బాలుర విషయ చర్చకు మేము లజ్జతో వెనుదీయుదుము. ఓ జగజ్జనులారా, దయామయునియెడ భీతిని కలిగియుండుడు! మా పవిత్రఫలకమునందు మీకు నిషిద్ధమైనదాని నాచరింపవలదు. త్రోవదప్పి, వాంఛలదిగ్భ్రమయందు సంచరింపబోకుడు.
వీలునామా వ్రాయుట ప్రతి యొక్కరికిని విధియుక్తమై యున్నది. వీలునామాకర్త, తన శాసనమునకు మహోన్నత నామమును శీర్షిక గావించి, ఆ శాసనమందున - భగవంతుని దివ్యావిష్కరణోదయమున ఏకేశ్వరత్వమునకు సాక్ష్యము వహియించి, సృష్ట్యావిష్కరణ లోకముల యందున తనకు ప్రతీకయై, పరమ రక్షకుడును, విశ్వసనీయుడును అగు తన భగవంతుని వద్ద యొక నిక్షిప్తసంపద యగునటుల, తాను శ్లాఘనీయమని యెంచిన దానిని లిఖియింపవలె.
సమస్త పర్వదినములును మహోన్నత పర్వదినద్వయమునను, దినద్వయమున సంభవించు మరి రెండు పండుగలయందునను సమ్మిళితమైనవి; మహోన్నత పర్వదినములలో మొదటిది : సకల దయామయుడు, సమస్త సృష్టిపైనను తన యుత్కృష్ట నామధేయముల, తన మహోన్నత స్వభావముల దేదీప్యమాన మహిమను వర్షింపజేసిన దినములలో సంభవింప, రెండవది : మృతులను పునరుజ్జీవితులను గావించి, సమస్త భూస్వర్గవాసులను సమీకృత మొనరించిన ఈ దివ్యనామపు సంతోషదాయక వర్తమానమును మానవాళికి ఘోషించిన ‘ఆయన’ ను మేము ఉత్తిష్ఠుని గావించినట్టిది. నిర్దేశకుడును, సర్వజ్ఞుడును అగు ‘ఆయన’ చే నివ్విధముగ నాదేశింపబడినది.
అస్వస్థతావస్థలయందు సమర్ధులగు వైద్యులనాశ్రయింపుడు; మేము భౌతిక సాధనముల వినియోగము నలక్ష్యము గావింపలేదు; భగవంతుడు తన యుజ్జ్వల, మహిమాన్విత ధర్మమునకు ప్రత్యూషస్థలిగ నియమించిన ఈ దివ్యలేఖినితో దీనినామోదించితిమి.
ప్రత్యూషఘడియలో, తన యాలోచనలను దైవముపై కేంద్రీకరించి, ఆయన దివ్యనామస్మరణమున మగ్నుడై, ఆయన క్షమనర్ధింపుచు, మష్రిఖుల్ -అఝ్కార్ దిశగా తన యడుగులనువైచి, అందు ప్రవేశించి, సార్వభౌముడును, శక్తివంతుడును, సమస్తసంకీర్తితుడును అగు భగవంతుని ప్రవచనములను మౌనముగ నాలకించుటకై యాసీనుడగునాతడు ధన్యుడు. వచించు : నా సంకీర్తనమునకై గ్రామములయందునను, నగరములయందునను నెలకొల్పబడిన ప్రతి భవనమును మష్రికుల్- అఝ్కార్ యే. ఈ నామము కీర్త్యాసనమున కెదుట సూచితమైనట్టిదని గ్రహియింపుడు.
ఓ నా జనులారా! నా సృష్టియందున నన్ను ప్రస్తుతించుటకును, నా సామ్రాజ్యవ్యాప్తముగ నా దివ్యవాక్కును సముద్ధతి నొందించుటకును ఉద్యుక్తులైన నా సంచిత సేవకులకు సాహాయ్యము గావింపుడు. వీరు యదార్ధమునకు, మానవజాతికి నా ప్రేమాన్విత స్వర్గపు తారకలు, నా మార్గదర్శక దీపికలు. కాని నా పావన ఫలకములయం దనుగ్రహీతమైన దానికి విరుద్ధముగ పలుకునాతడు నావాడు కాడు. ఏ దుష్కపటినైనను మీరనుసరింతురేమో, జాగరూకులు కండు. భూ స్వర్గముల నడుమ తన వాణిని వెలువరించునాతడును, ఉషోదయ కారకుడును అగు ‘ఆయన’ ముద్రచే ఈ దివ్యఫలకములు అలంకృతములైనవి. నిక్కమగు ఈ పిడిని, శక్తిసమన్వితమును, దుర్భేద్యమును అగు నా దివ్యధర్మ పాశమును బలముగ చేబూనుడు.
మీ శిరములను విశ్వసనీయత, సౌశీల్యములనెడు సుమహారముల తోడను, మీ మనములను దైవభీతితోడను, మీ జిహ్వలను సంపూర్ణ సత్యసంధత తోడను, మీ దేహములను సౌజన్యాంబరము తోడను అలంకరింపుడు. మీరు పర్యాలోచింపగలవారేని, యదార్ధమునకు, మానవ దేహాలయమునకు తగిన భూషణములివి. ఓ బహాజనులారా! సత్యస్వరూపుడగు భగవంతుని శుశ్రూషా పాశమును చేబూనుడు; ఏలయన, ఆపై మీ స్థానములు వెల్లడియగును; మీ నామములు లిఖియింపబడి, భద్రపరుపబడును, మీ బిరుదము లౌన్నత్యము నొందును; భద్రఫలకమున మీ స్మరణ సంకీర్తితమగును. మహిమాన్వితమును, సమున్నతమును అగు ఈ స్థానమునుండి భూలోకవాసులు మిమ్ము ప్రతిరోధింతురేమో, జాగరూకులు కండు. మా యనేక లేఖలయందునను, మీ దైవమును, అధికారవంతుడును, సకలవివేకియును అగు భగవంతుని శాసనప్రభాత నక్షత్రము ప్రకాశితమైనట్టి మా యీ పవిత్ర ఫలకమున మిమ్మీ విధముగ ప్రబోధించినాము.
నా ప్రత్యక్షతా పయోనిధి క్షీణతనొంది, మా దివ్యావిష్కరణాగ్రంథము సమాప్తినొందినపుడు, దైవసంకల్పితుడును, ఈ ప్రాచీనమూలోద్భవుడును అగు ‘ఆయన’ వంకకు మీ వదనములను సారింపుడు.
మానవ మస్తిష్కములెంతటి యల్పములో యోచింపుడు. వారు తమకు హానికారకముల నపేక్షింతురు, తమకు లాభకరముల నుపేక్షింతురు. వారు యదార్ధమునకు సన్మార్గదూరులు. కొందరు స్వేచ్ఛనభిలషింపుచు, దానియం దహంకారపూరితులగుటను మేమవలోకించినాము. అట్టివారజ్ఞానపు టగాధమందున్నారు.
వచించు : నిజమగు స్వేచ్ఛ, నా యాజ్ఞలకు లోబడియుండు మానవుని విధేయతయందున్నది, స్వల్పముగనైనను తెలియుడు. మానవులు దివ్యావిష్కరణ స్వర్గమునుండి తమకనుగ్రహీతమైన దానిని పాటించిరేని వారు నిశ్చయముగ పరిపూర్ణస్వేచ్ఛ నొందగలరు. సృజిత వస్తు సమస్తమును ఆవరించినయట్టి తన యభీష్టస్వర్గము నుండి భగవంతునిచే నావిష్కృతమైన ప్రయోజనమును గ్రహియించిన యాతడు ఆనందభరితుడు. వచించు: నిత్యసత్యమగు భగవంతుని పరిపూర్ణ సేవయందు తప్ప నీకు లబ్ధినిచ్చు స్వేచ్ఛ యింకెందునను కానరాదు. దాని మాధుర్యము నాస్వాదించిన యాతడు దానిని సమస్త భూ స్వర్గ సామ్రాజ్యముల వినిమయమునకైనను విక్రయింపడు.
ఒక సంవత్సరమందలి మాసముల సంఖ్య పంధొమ్మిదియని భగవంతుని దివ్యగ్రంథమున నిర్దేశితమైనది. వీనియందలి ప్రథమ మాసము సమస్త సృష్ట్యావృతమగు ఈ దివ్యనామముచే నలంకృత మైనది.
మృతులను గాజుతో గాని, దృఢమగు రాతితోగాని, మేలైన మన్నికైన దారువుతో గాని చేయబడిన శవపేటికల యందుంచవలెనని, అక్షరములు చెక్కిన అంగుళీయములను వారి వ్రేళ్లకు తొడుగవలెనని పరాత్పరుడు నిర్దేశించినాడు. ‘ఆయన’ యదార్ధమునకు, పరమ నిర్దేశకుడు, సర్వవిదుడు.
ఈ యంగుళీయకములపై పురుషులకు : “స్వర్గముల యందునను, భూమిపైనను, వాటి మధ్యనుగల సమస్తమును భగవంతునిది; వాస్తవమున కాయన సమస్త విషయజ్ఞుడు” అనియు, స్త్రీలకు : “స్వర్గముల యందునను, భూమిపైనను, వాటి మధ్యనుగల సామ్రాజ్యము భగవంతునిది; వాస్తవమున కాయన సకలాంశముల పైనను అధికారయుతుడు” అనియు అక్షరము లుండవలె. ఈ దివ్య ప్రవచనములు ఇతఃపూర్వమే యావిష్కృతములైనవి; అయినను, చూడుడు, ప్రస్తుతము బయాన్ కేంద్రము: “ఓ లోకముల శ్రేష్ఠప్రియుడా ! వాటి స్థానమున సమస్తమానవాళిపైనను నీ దయానుగ్రహముల పరిమళములను ప్రసరించు ప్రవచనముల నావిష్కరింపుము. నీ నుండి వెలువడు ఒక్క పదము బయాన్ నందనుగ్రహీతమైన సమస్తమును అధిగమించునని మేము ప్రతియొక్కరికిని ప్రకటించినాము. వాస్తవమునకు, నీవు నీకు సంప్రీతికరమైన దానినొనరింప సమర్ధుడవు. నీ భృత్యులను నీ కారుణ్యసాగరము నుండి పొంగిపొరలు అనుగ్రహములకు దూరము చేయకు. వాస్తవమునకు, నీవు అపారకరుణాన్వితుడవు,” అని ఘోషింపుచున్నది. అవలోకింపుడు, మే ‘మాయన’ పిలుపు నాలించి, ‘ఆయన’ ఇచ్ఛనిపుడు నెరవేర్చినాము. ‘ఆయన’, యదార్ధముగా, సర్వోత్తమ ప్రియుడు, ప్రార్థనల సమాధానకర్త. ఈ క్షణమున, భగవత్ప్రసాదితమైన ఈ క్రింది ప్రవచనము స్త్రీ, పురుషుల ఖననాంగుళీయములపై చెక్కబడుటయనునది వారికి యింకను శుభప్రదము; నిశ్చయముగ, మేము పరమనిర్దేశకులము : “నేను దైవము నుండి ఆగమించి, దయాళువును, కరుణాళువును అగు ‘ఆయన’ దివ్యనామమును దృఢముగ చేబూని, ‘ఆయన’ వినా సర్వమును త్యజియించి, ఆయన కడకే తిరోగమించు చుంటిని.” పరాత్పరుడీ విధముగ తన సాన్నిధ్యానుగ్రహమునకై యెంచుకొనిన వారిని ప్రత్యేకించినాడు. ‘ఆయన’, సత్యముగా, శక్త్యధికారముల కధిదేవుడు.
అంతియేగాక, పట్టు లేదా నూలు వస్త్రము లైదింటి యందున మృతుని చుట్టవలెనని భగవంతు డాదేశించినాడు. పరిమిత వనరులు గలవారు వీటియందే రకముదైనను ఒక్క వస్త్రములో చుట్టిన చాలును. ఇవ్విధముగ సర్వజ్ఞుడును, సకలవిదుడును అగు ‘ఆయన’ చే నిర్దేశితమైనది. నగరము నుండి ప్రయాణకాలము ఒక గంటకు మించునట్టి దూరమునకు మృతదేహమును తరలించుట మీకు నిషేధింపబడినది. అట్లుగాక, అది యానందముతో, ప్రశాంతముగ ఒక సమీప ప్రదేశమున ఖననము గావింప బడవలె.
ప్రయాణమునకు సంబంధించి బయాన్ గ్రంథమునందు విధియింప బడిన ఆంక్షలను దేవుడు తొలగించినాడు. ‘ఆయన’ యదార్ధమునకు అనిర్బంధనుడు; ‘ఆయన’ తనకు ప్రియమైనదానినొనర్చును, తన యభీష్టమును నిర్దేశించును.
పావనప్రదేశములు రెండింటియందునను గల గృహద్వయమును, సకల దయామయుడగు మీ దేవుని సింహాసనము సంస్థాపితమైన యితర స్థలములను ప్రవృద్ధమొనరించి, ప్రస్తుతింపుడు. అవగాహనాయుత మనస్కులగు ప్రతి యొక్కరి దైవము ఈ విధముగ నాజ్ఞాపింపుచున్నాడు.
ఇక, ఈ దివ్యావిష్కరణకు నివాళిగ నా యగ్రదూతయగు ‘ఆయన’ లేఖిని నుండి, జాలువారిన ఈ ప్రవచనములను స్ఫురణకు దెచ్చుకొని, నా యావజ్జీవితకాలమునను దమనకారుల హస్తములు ఎట్టి దుశ్చర్యలను కొన సాగించినవో యోచింపుడు. సత్యమునకు, వారు గతియించినవారియందున గణియింపబడినారు. ‘ఆయన’ యిట్లు పలికినాడు : “మేము ప్రత్యక్షీకరించు ‘ఆయన’ సమక్షప్రాప్తి నొందితిరేని, ఔదార్యముతో మీ పర్యంకములపై నాసీనుడగు వరప్రదాన మొనరింపుమని భగవంతుని యర్ధింపుడు. అట్టి చర్యే మీ పై అసమాన గౌరవాతిశయములను కురియించును. ఆయన మీ గృహముల యందొక్క చిరుపాత్ర యుదకమును సేవించినను సకల విశ్వాసులకే కాదు, సమస్త జీవకోటికి జీవనజలమును సమర్పించిన దానికన్న మిన్నయైన ఫలము దక్కును. ఓ నా భృత్యులారా! తెలిసికొనుడు.”
ఈ యుగమందెవ్వడును, ఈ దివ్యావిష్కరణమునందు వెలువరింప బడిన దానిని తప్ప మరిదేనినీ సుస్థిరముగా నవలంబింపరాదు. ఇది భూత భవిష్యత్కాలములకు భగవంతుని నిర్దేశము; పూర్వపు దివ్యవార్తాహరుల పవిత్రలేఖనములు అలంకృతములైనట్టి నిర్దేశమిది. ఇది భూతభవిష్యత్కాలములకు భగవంతుని ప్రబోధము; దివ్యజీవనగ్రంథ ప్రవేశికను ప్రవృద్ధమొనరించిన ప్రబోధమిదియని గ్రహియింతురు గాక. ఇందుకు బదులు అజ్ఞానావమానముల నెంచుకొందురేమో జాగరూకులు కండు. ఈ దినమున భగవంతుడు దక్క ఎవ్వరును మీకు ఉపకరింపరు; సర్వజ్ఞుడును, సకల వివేకియును అగు ‘ఆయన’ తప్ప వేరొండు ఆశ్రయమును లేదు. నన్ను తెలిసికొనిన వారు సమస్త వాంఛల లక్ష్యమును తెలిసికొనినట్లే; నన్నాశ్రయించినవారు, సమస్త ఆరాధనాలక్ష్యము నాశ్రయించినట్లే. సకల జగన్నాయకుడు దివ్యగ్రంథమునం దివ్విధముగ నిర్దేశించి నిర్ధారించినాడు. భూత, వర్తమానతరములయందలి గ్రంథసమస్తమును గ్రాహ్యమొనరించు కొనుటకన్న కేవలము నా ప్రవచన మొక్కదానిని పఠియించిన చాలును. మీకు చెవులుండి వినజాలితిరేని, సకల దయామయుని వాణి యిది! వచించు: జ్ఞానసారమిదియేనని గ్రహియింపుడు.
ఇక ఇప్పుడు, దైవవశమున మీ స్వీయభావనలను త్యజియించి, అస్తిత్వ ప్రభుడగు భగవంతునిదెసకు మీ వదనములను సారింప వచ్చునని వేరొక రచనాభాగమునందు వెలువరింపబడిన దానిని గుఱించి యోచింపుడు. ‘ఆయన’ (బాబ్) యిలా ప్రవచించినాడు: “బయాన్ విశ్వాసిని దక్క అన్యులను వివాహమాడుట శాసనవిరుద్ధము. వివాహకాలమునకు కేవలమొక పక్షమే దివ్యధర్మమునవలంబించి యుండెనేని, అతని లేదా ఆమె సంపదలు రెండవ పక్షమునకు - దివ్యధర్మములోనికి పరివర్తనమొందనంత వరకును - శాసనవిరుద్ధము లగును. అయినను, ఈ శాసనము యదార్ధమునకు - మేము ప్రత్యక్షీకరించునట్టి ‘ఆయన’ దివ్యధర్మము కాని, న్యాయమునకు యితః పూర్వమే ప్రత్యక్షీకరింపబడినది కాని ఔన్నత్యమునొందినపుడే అమలు జరుగును. ఇందుకు ముందుగా, మీ యభీష్టానుసారముగ వివాహబంధము నేర్పరచు కొనవచ్చును, ఈ విధానముతో మీరు దివ్యధర్మమునకు ఔన్నత్యమును సముపార్జింప వచ్చును. సకలౌదార్యుడగు తన దైవమును సంకీర్తింపుచు, ఉత్కృష్ట శాఖనుండి కోకిల మధురస్వరముతో నాలపింపుచున్నది. ఆలకించు వారికి శుభమగు గాక.
ఓ బయాన్ జనులారా, సత్యశక్తిచే యనుగ్రహీతమైన ఈ వాణిని న్యాయదృష్టితో పరికింపుడనియు, దైవనిదర్శనమును వీక్షించియు దాని నుపేక్షించి, తిరస్కరించు వారలు కావలదనియు సర్వేశ్వరుడును, కారుణ్య దైవమును అగు మీ భగవంతునిసాక్షిగా నేను మీకు సూచింపుచున్నాడను. వారు వాస్తవమునకు తప్పక నశియించు వారు. ఈ దివ్యప్రవచనమున బయాన్ కేంద్రము తన స్వీయదివ్యధర్మ సమక్షమున నా దివ్యధర్మౌన్నత్యమును విస్పష్టముగ ప్రస్తావించినది; ఇందుకు ధర్మబద్ధమును, అవగాహనాయుతమును అగు ప్రతి మనస్సును సాక్ష్యము వహియించును. మీరీ దినమున స్వయముగ తక్షణమే విలోకింప గలుగుచున్నటుల, దీని ఘనత యెంతటిదన - నశ్వరజీవిత మైకమున అంధులైనవారును, తదనంతర జీవితమున తమకై అవమానకరమైన దండన నిరీక్షింపుచున్నయట్టి వారును దక్క అన్యులెవ్వరును కాదనలేనట్టిది.
ఈ దివ్యవివేక ప్రత్యూషముచే నుచ్చరింపబడిన దానిని ‘ఆయన’(బాబ్) ఇతఃపూర్వమే మీకు విశదీకరించినాడు. ‘ఆయన’ (బాబ్) ఇట్లు సెలవిచ్చినాడు : “మరి ‘ఆయన’ సత్యమునే వచించును : ‘యదార్ధమునకు, ఏకైకుడను, తుల్యరహితుడను, సర్వజ్ఞుడను, సకల ప్రాజ్ఞుడను అగు నేను తప్ప వేరొక దేవుడు లే’ డని, సర్వావస్థలయందునను ప్రకటించగల వాడు ‘ఆయన’ యే.”(బహాఉల్లా) ఈ పరమోన్నత, ఈ యమూల్యాద్భుత దివ్యావిష్కరణమునకు పరమేశ్వరుడు ప్రత్యేకించి ప్రసాదించిన స్థానమిది. ‘ఆయన’ ఔదార్యాన్వితానుగ్రహానికిది ప్రతీకయని, అప్రతిహతమగు ‘ఆయన’ తీర్మానమునకు సంకేతమని మీరు గ్రహియింపగల్గినచో గ్రహియింపుడు. ఇది ‘ఆయన’ పరమోన్నత నామమని, పరమోత్కృష్ట ప్రవచనమని, ఆయన మహోత్కృష్ట బిరుదముల ప్రత్యూషమని గ్రహియింపుడు. అంతియే కాదు, ప్రతి స్రవంతి మూలమును, ప్రతి దివ్య మార్గదర్శన ఉషోదయస్థానమును ‘ఆయన’ మూలముననే ఏర్పరుపబడినది. ఓ ప్రజలారా, సత్యముగా అనుగ్రహీతమైనట్టి దానిని గురించి దీర్ఘముగ నాలోచింపుడు, అందుపై పర్యాలోచింపుడు, కాని అతిక్రమించువారు కావలదు.
సర్వమతస్థులును మీ నుండి భగవంతుని మధుర సౌరభముల నాఘ్రాణించుటకై, వారితో మీరు మైత్రీభావమున, సామరస్యమున సహజీవన మొనరింపుడు. మానవులయందలి మూర్ఖత్వపుటజ్ఞానజ్వాల మిమ్ములను జయింపకుండ జాగరూకులు కండు. సమస్తవస్తు సంచయమును భగవంతుని నుండే వెలువడును, తిరిగి ‘ఆయన’ చెంతకే తిరోగమించును. సమస్త విషయములకును ‘ఆయన’యే మూలాధారము. సమస్తమును ‘ఆయన’ యందే సంలీనమగును.
ప్రతి పంధొమ్మిది సంవత్సరములు గడిచిన పిదప, మీ గృహోపకరణములను నవీకరించుకొనుట మీకు నిర్దేశితమైనది; సకల విదితుడును, సర్వజ్ఞుడును అగు ‘ఆయన’ చే మీకీవిధముగ నాదేశితమైనది. యదార్ధమునకు, ‘ఆయన’ మీయొక్క, మీ యాస్తిపాస్తులయొక్క పరిశుద్ధత నభిలషింపుచున్నాడు. దైవభీతిని త్రోసిపుచ్చవలదు, అలక్ష్యపరులు కావలదు. తమ యార్ధిక వనరులిందుకు చాలకపోవుటచే, దీనిని పాటించలేకపోయిన వారు నిరంతర క్షమాశీలియును, మహౌదార్యుడును అగు భగవంతునిచే క్షమియింప బడినారు.
జూదమును, నల్లమందు సేవనమును మీకు నిషేధింపబడినవి. ఓ ప్రజలారా ! అతిక్రమించువారి ననుసరింపక, ఆ రెండింటిని వర్జింపుడు. మానవదేహమునకు మాంద్యమును, భారమును కలిగించి, హానిచేయు ఎట్టి పదార్ధమును ఉపయోగింపక జాగరూకులు కండు. మేము, సత్యముగా, మీకు ప్రయోజనకరమగునది దక్క అన్యము మాకు అభిలషణీయము కాదు. సమస్త సృష్టియును ఇందుకు సాక్ష్యము, చెవులుండిన యాలకింపుడు.
విందునకు గాని, పండుగ వేడుకకు గాని ఆహ్వానితులైనపుడు ఆనందో త్సాహములతో స్పందింపుడు; తన వాగ్దానమును నిలుపుకొను నాతడు నిందారోపణ నుండి సురక్షితుడు. వివేచనాయుతమగు భగవన్నిర్దేశము లన్నియును విశదీకరింపబడిన దినమిదియే.
భగవంతుని యందునను, ‘ఆయన’ సంకేతముల యందునను తనకు గల విశ్వాసము నంగీకరించి, “ ‘ఆయన’ తన చర్యలకు ప్రశ్నింపబడ” డని గ్రహియించిన యాతడు ధన్యుడు. అట్టి గుర్తింపు, భగవంతునిచే ప్రతి విశ్వాసమునకు ఆభరణముగను, దానికి మూలముగను గావింపబడినది. ప్రతి సత్కర్మావలంబనమును అందుపై ఆధారితమై యుండవలె. తిరుగుబాటుదారుల మంతనములు మిమ్ముల నాకస్మికపతనము నొందనీయ కుండునటుల దానిపై మీ దృష్టిని స్థిరముగా నిలుపవలె.
ఓ కాఫ్, రా (కిర్మాన్) భూభాగమా! మేము, నిశ్చయముగా నీవు భగవంతుని యెడ అసంతోషముతో నుండుటనూ వీక్షింతుము, అటులనే సర్వజ్ఞుడును, సకల గ్రాహియును అగు ‘ఆయన’ కు దక్క అన్యులెవ్వరికిని గ్రాహ్యము కానిది నీ నుండి వెడలిపోవుటనూ అవలోకింతుము; నీ నుండి గోప్యముగ, అపహృతమై వెలువడు దానిని సైతము గ్రహియింతుము. పవిత్ర ఫలకమున లిఖితమైన సమస్త వస్తు పరిజ్ఞానమును మాయొద్ద నున్నది. నీకు సంభవించిన దానికి చింతిల్లకు. మతగురువుల దుష్ట సలహాలు నిరోధించలేనటుల, అనుమాన బీజములను నాటువారి కపటోపాయములచే వెనుదీయ లేనటుల, నా శక్తియుత నామమును సుస్థిర మొనరించునట్టి శక్తివంతులను, పరాక్రమశాలురను భగవంతు డనతికాలములోనే నీయందావిర్భవింపజేయగలడు. వారు తమ స్వీయ నేత్రములతో దేవుని దర్శించి, తమ స్వీయజీవితములనొడ్డి ఆయన*కు విజయమును చేకూర్చెదరు. వాస్తవమునకు వారు దృఢచిత్తులు.
ఓ మతాధిపతుల సమూహమా! నా దివ్యప్రవచనములు అనుగ్రహింపబడి, నా విస్పష్టచిహ్నములు వెల్లడియైనపుడు, నీవు తెర మరుగునయుండ గాంచితిమి. నిజమునకిది వింతయే. నా నామమున కీర్తింప బడుచున్నను, సకలాధార సమన్వితముగ, నిదర్శనా పూర్వకముగ పరమేశ్వరుడు మీమధ్య ప్రత్యక్షమైనప్పుడు గుర్తించరైతిరి. మేము తెరలను చీల్చి దూరముగ విసరి వైచితిమి. జనులను వేరొక ముసుగులో కప్పివేయుదురేమో, జాగ్రత్త. సకల జననాధుని పేరిట వ్యర్ధపుటూహల శృంఖలములను త్రుంచి వేయుడు; అంతియేతప్ప, వంచకులు కావలదు. మీరు భగవంతుని ఆశ్రయించి, ‘ఆయన’ దివ్యధర్మము నవలంబించిరేని, అందున అశాంతిని వ్యాపింప చేయవలదు, భగవంతుని దివ్యగ్రంథమును మీ స్వార్ధపూరిత వాంఛలతో తులనము గావింపవలదు. నిశ్చయముగా, భూత భవిష్యత్తుల యందున భగవంతుని యుపదేశమిది; అవును, భగవంతుడును, ‘ఆయన’ యనుగ్రహప్రాప్తినొందినవారును, ‘మా’ యందలి ప్రతి యొక్కరమును ఇందుకు సాక్ష్యమును వహించి ధృవీకరింతుము.
తన సమకాలీన మతాధిపతులలో మహాపండితునిగా గణుతికెక్కిన మహమ్మద్ హసన్ నామధేయము గల షేఖ్‌ను స్ఫురణకు దెచ్చికొనుడు. సత్యసంధుడు సాక్షాత్కరించినవేళ, గోధుమలను, బార్లీని జల్లించు నాతడొక్కడు ‘ఆయన’ నంగీకరించి దేవదేవుని వైపుకు తిరుగగా, ఈ షేఖ్ తనవంటి మరికొందరితో పాటుగా ‘ఆయన’ ను తిరస్కరించాడు. దైవశాసనములని, నియమములని తాను భావించినవాటిని క్రోడీకరించుట యందాతడు రేయింబవళ్లు నిమగ్నుడైయున్నను, అనిర్బంధనుడగు దేవుడు ప్రత్యక్షమైనపుడు, వాటి యందలి యొక్క అక్షరమైనను ఆతనికి అక్కరకు రాలేదు, లేనిచో నాతడు - దైవానుగ్రహీతుల వదనములను శోభిల్లజేసిన ‘ఆయన’ దివ్యముఖారవిందము నుండి వైదొలగి యుండెడువాడు కాడు. భగవంతుడు ప్రత్యక్షీకృతుడైనప్పుడు మీ ‘రాయన’ ను విశ్వసించియుండిన, ప్రజలు ‘ఆయన’ నుండి వైదొలగి పోవువారును కారు, ఈనాడు మీరవలోకింపుచున్నవి మాకు సంభవించెడివి కావు. భగవద్భీతిని కలిగి యుండుడు, అలక్ష్యపరులు కావలదు.
సకల నామాధిపతియగు ‘ఆయన’ ను దరిచేరనీయక ఏ నామమైనను మిమ్ము నిరోధించునేమో, మీ వివేకములకు మూలాధారమగు ‘ఆయన’ స్మరణను ఏ పదమైనను విస్మరింప జేయునేమో జాగరూకులు కండు. ఓ మతగురువుల సముదాయమా! భగవంతుని కభిముఖులై ‘ఆయన’ సంరక్షణను అర్ధింపుడు; నాకును, నా సృష్టికిని మధ్య అడ్డుతెఱలు కావలదు. మీ చర్యలు సమసిపోవలెననియు, మీ స్థితిని మీరే మఱచితిరనియు మీ ప్రభుడీ విధముగ మిమ్ములను న్యాయవర్తనులై మెలగుడని ఉద్బోధింపుచూ, ఆజ్ఞాపింపుచున్నాడు. ఈ దివ్యధర్మతిరస్కారకుడు, సమస్తసృష్టియందలి మరే దివ్యధర్మపు సహేతుకతనైనను నిరూపింపగలడా? లేదు, విశ్వరూపకర్తయగు దేవుని సాక్షిగా, నిరూపింపలేడు. ఆయినను ప్రజలింకను దృగ్గోచరమగు ముసుగులో కప్పివేయ బడినారు. వచించు: ఈ దివ్యధర్మము ద్వారా ప్రామాణిక ప్రభాతనక్షత్రము ఉదయించినది. నిదర్శనాప్రకాశము ప్రపంచ జనులందరిపైనను ప్రసరిల్లినది. ఓ అంతర్దృష్టియుతులారా, భగవద్భీతిని కలిగి యుండుడు, నన్ను విశ్వసింపనివారు కావలదు. “ప్రవక్త” యను పదము ఈ పరమోన్నత ప్రకటన నుండి మిమ్ము నిరోధించునేమో, లేక సమస్త లోకావృతమగు భగవంతుని సార్వభౌమత్వమున కధీకృత ప్రతినిధి యగు ‘ఆయన’ నుండి “ప్రాతినిధ్య” పరమైనదేదైనను, మిమ్ము నిలిపివేయునేమో జాగరూకులు కండు. ప్రతి నామమును ‘ఆయన’ దివ్యవాగ్జ్జనితమే; ప్రతి ధర్మము, అప్రతిహతమును, శక్తివంతమును, అద్భుతమును అగు ‘ఆయన’ దివ్యధర్మాధారితమే. వచించు: సమస్తలోకముల సంరక్షణాదక్షుడగు ‘ఆయన’ దక్క వేరెద్దియును ప్రస్తావితము గానట్టి దివ్యదినమిది. మీ యంధవిశ్వాసములను, విగ్రహములను ప్రకంపిల్లజేసిన దివ్యధర్మమిది.
సంకటహరుడును, స్వయంభువును అగు, దైవమును ఖండించుటకై ఇతరమగు ప్రతి దివ్యధర్మపుటనుయాయులును తమ పవిత్ర గ్రంథముల యందున హేతువులకై యన్వేషించిన చందముననే, భగవంతుని దివ్యగ్రంథమును చేబూని అందుండి నిదర్శనములను, వాదములను ఎత్తి చూపుచు తన దైవమును పరిత్యజింపచేయజూచు వానిని నిశ్చయముగా మీయందే మేమవలోకింపు చున్నాము. వచించు: “యదార్ధమునకు సర్వజ్ఞుడను, సకల వివేకవంతుడను అగు నేను తప్ప వేరు దైవము లే” డని సృష్టి హృదయాంతరాళము నం దుద్ఘోషింపుచున్నయట్టి ఈ సజీవ దివ్యగ్రంథము దక్క, ప్రపంచమందలి పవిత్ర గ్రంథావళి గాని, సమస్త పుస్తకములు, రచనలు ఎవ్వియునుగాని ఈ దివ్యదినమున ఇందుకై మీకుపకరింపవు.
ఓ మతాధిపతుల సముదాయమా! దివ్యధర్మపు తొలి దినముల యందున మీరు దాని నిరాకరణకు కారకులైనటులే, భూమిపై కలహములకు కారకులగుదురేమో, జాగరూకులు కండు. “సకల సంకేతములకును ప్రత్యూషస్ధానమగు భగవంతునిదే సామ్రాజ్య” మని గులకరాళ్లను సహితము ఘోషిల్లజేసిన ఈ దివ్యప్రవచనము చుట్టును ప్రజలను సమీకరింపుడు. మీ దేవదేవుడు తనయౌదార్యములో ఒక భాగముగ ఆయన మిమ్మీవిధముగ హెచ్చరింపుచున్నాడు; వాస్తవమునకు ఆయన నిత్యక్షమాశీలి, పరమోదారుడు.
నిశ్చయముగా ఈ భూలోకమున పరంధాముని ప్రత్యక్షీకరింపజేసి ‘ఆయన’ సార్వభౌమత్వమును సాక్షాత్కరింపచేయుట తప్ప మాకు వేరొండు పరమార్ధము లేదు; నాకు సాక్షిగా నుండుటకు భగవంతుడే తగినవాడు. సత్యముగా ఉత్కృష్ట సామ్రాజ్యమునం ‘దాయన’ దివ్యధర్మమును సమున్నత మొనరించి, ‘ఆయన’ ప్రఖ్యాతిని శ్లాఘించుట తప్ప మాకు వేరొండు యుద్దేశ్యము లేదు; నాకు రక్షకుడగుటకు దేవుడే తగినవాడు. యదార్ధమునకు, భగవంతుని, ‘ఆయన’ యనుగ్రహించిన దానిని స్తుతించుట వినా దివ్య సామ్రాజ్యమున మాకు వేరొండు కాంక్ష లేదు; నాకు సహాయకారి యగుటకు దేవదేవుడే తగినవాడు.
ఓ ప్రపంచ ప్రజలారా! మార్మికకపోతము తన దివ్యసంకీర్తనా శ్రయము నుండి బయల్వెడలి, తన సుదూర గమ్యమునకు, తన నిగూఢఆవాసమునకు ఎగసిపోయినపుడు, దివ్యగ్రంథము నందేదైనను మీకవగతము కానిచో, ఈ మహావృక్షము నుండి యావిర్భవించిన శాఖయగు ‘ఆయన’ కు నివేదింపుడు.
ఓ బయాన్ జనులారా! వాస్తవమునకు మీరు జాగ్రదావస్థ యందుండగ మేము భగవంతుని విద్యాలయమునం దడుగిడితిమి; మీరు గాఢనిద్ర యందుండగ దివ్యఫలకమును పారాయణము గావించితిమి. సత్యైకదేవుని సాక్షిగా! మీకింకను దెలియక మునుపే, ఆవిష్కరణకు పూర్వమే దివ్యఫలకమును పఠియించినాము; మీరింకను జనియింపక మునుపే, మాకు దివ్యగ్రంథమును గుఱించిన సంపూర్ణపరిజ్ఞానమున్నది. ఈ వాక్కులు, మీ ప్రామాణికతకే తప్ప భగవంతుని ప్రామాణికీకరణకు కాదు. మీరు గ్రహియింప గలవారేని, ఆయన జ్ఞానమునందు నిక్షిప్తమైనట్టిదే ఇందుకు నిదర్శనము; మీరు అవగాహనాపరులైనచో సర్వశక్తివంతుడగు దేవాధిదేవుని జిహ్వయే ఇందుకు సాక్ష్యము వహియించును. భగవంతునిపై ప్రమాణము ! మేము తెఱను తొలగించినమీరు నిశ్చేష్టులగుదురు.
మీరు భగవంతుని గుఱించియును, ఆయన దివ్యధర్మమును గుఱించియును వ్యర్ధముగ కలహింపరాదని తెలిసికొనుడు; ఏలయన, అదిగో వీక్షింపుడు! భూత వర్తమానస్థితములగు వస్తుసమస్తమును ఆవరించినయట్టి మహా దివ్యావిష్కరణముతో ‘ఆయన’ సాక్షాత్కరించినాడు. దివ్యసామ్రాజ్య వాసుల భాషలో మేము ప్రసంగింపవలసి వచ్చినయట్లైన “సత్యముగా, భగవంతుడు ఆ దివ్యవిద్యాలయమును, భూస్వర్గముల సృష్టికి పూర్వమే సృజియించినాడు. అ మరియు గు అక్షరములను జతగూర్పక మునుపే, మేమందు ప్రవేశించితి” మని పలుకుదుము. మా దివ్యసామ్రాజ్యమున మా పరిజనులభాష యిట్టిది. మా యుత్కృష్ట దివ్యధామవాసుల భాష యెటు లుండునో యోచింపుడు, ఏలయన వారికి మేము మా పరిజ్ఞానము ననుగ్రహించినాము, దైవజ్ఞాన నిక్షిప్తమైన సకలమును వెల్లడించినాము. కనుక భగవంతుని సర్వవైభవసామ్రాజ్యమున శౌర్యవైభవ జిహ్వ యుచ్చరించునదేమో యూహింపుడు.
బయాన్ గ్రంథమునం దావిష్కృతమైనది యేదైనను, పరమ కరుణాన్వితుడగు మీ ప్రభుని నుండి మిమ్ము దూరము గావించునేమో జాగరూకులు కండు. నా కీర్తిని యుగ్గడించుటకు తప్ప అన్యప్రయోజనమునకై బయాన్ అనుగ్రహీతము కాలేదనుటకు భగవంతుడే నాకు సాక్షియని యెరుంగుడు ! నిష్కల్మష హృదయులిందున నా ప్రేమపరిమళములనే కనుగొందురు, గోచరా గోచర సమస్తమును ఆచ్ఛాదించిన నా దివ్యనామధేయమునే గాంచెదరు. వచించు: ఓ ప్రజలారా! నా మహోన్నత లేఖిని నుండి వెలువడినట్టి దాని నాశ్రయింపుడు. అందుండి దైవసౌరభముల నాఘ్రాణించినచో, ఆయనకు వ్యతిరేకముగ వర్తింపనూవలదు, ఆయన ప్రేమాన్విత ఉపకృతులయందలి, ఆయన అగణిత ఔదార్యానుగ్రహముల యందలి భాగమును విస్మరింపనూ వలదు. భగవంతుడు మిమ్మీ విధముగ హెచ్చరింపుచున్నాడు; నిశ్చయముగా ఆయన ఉపదేశకుడు, సర్వజ్ఞుడు.
బయాన్ గ్రంథాంశముల యందేదైనను మీ కవగతము కానియెడల, మీ ప్రభుడును, మీ పూర్వీకుల ప్రభుడును అగు భగవంతుని యర్ధింపుడు. ‘ఆయన’ అభిలషించెనేని, అందావిష్కృతమైన దానిని వ్యాఖ్యానించి, దాని ప్రవచనమహాబ్ధియందు నిక్షిప్తములైయున్న దివ్యజ్ఞాన, వివేక మౌక్తికములను మీకు వెల్లడింపగలడు. ‘ఆయన’ నిశ్చయముగా, సకల నామాధిపతి; సంకట హరుడును, స్వయంభువును అగు ‘ఆయన’ తప్ప దైవము లేడు.
నా ప్రవచన పయోనిధి యందున నిమజ్జనము కండు, తద్వారా మీరు దాని రహస్యములను ఛేదింపవచ్చును, దాని యగాధముల యందున దాగియున్న వివేకమౌక్తికములను కనుగొనవచ్చును. భగవంతుని శక్తిసామర్ధ్యములు వెల్లడిగావింపబడి, ఆయన సార్వభౌమాధికారమును స్థిరీకృతమొనరించిన ఈ దివ్యధర్మపు సత్యమును సమాశ్రయించుటయందున మీ సంకల్పము వికల్పము కాకుండ జాగరూకులు కండు. ప్రమోదముతో వెలుగొందు వదనములతో ఆయన దరిజేర వేగిరపడండి. భూత, భవిష్యత్తులయందున, నిరంతరమును మార్పునొందనిది ఈ భగవద్ధర్మము. తదన్వేషకుడు దాని ప్రాప్తినొందుగాక; తదన్వేషణను తిరస్కరించిన వాని విషయమున భగవంతుడు, నిశ్చయముగ, తాను సృజియించిన ప్రాణుల సర్వావశ్యకములకు అతీతముగా స్వయం సంపన్నుడు.
వచించు: ఓ దుస్స్వభావమూలమా! నీ స్వాతిశయాంధకారమును విస్మరించి ప్రజలయందు సత్యమునే వచింపుము. నీవు నీ స్వార్ధమనో వికారములకులోనై, నిన్ను మలిచి నీకు ఉనికిని ప్రసాదించిన ‘ఆయన’ ను పరిత్యజింపగా పరికించి పరితాపమునొందితినని భగవంతునిపై ప్రమాణము చేయుదును. దివ్యధర్మసేవకై మేము అహర్నిశలు నిన్ను పోషించిన విషయమును, పరమాత్ముని మృదుకారుణ్యమును స్ఫురణకు దెచ్చికొనుము. దైవభీతినొంది, యదార్ధముగా పశ్చాత్తాపగ్రస్తుడవై వర్తింపుము. నీ స్థాయిని గని లోకులు భ్రాంతినొందిరనుకొన్నను, నీవు సైతము నీ విషయమున అటులే భ్రాంతినొందితి వనుకొనవచ్చునా? భగవానుని యెదుట భయకంపితుడవై, మా సింహాసన పార్శ్వమున నిలిచి, మేము ప్రవచించిన ప్రవచనములను, సంరక్షణాదక్షుడును, శక్త్యధికారాధి నాథుడును నగు దేవుడు ప్రసాదించిన ప్రవచనములను మేము వక్కాణింపుచుండ నీవు లిఖించిన దినములను పునరావలోకనము గావించుకొనుము. భగవంతుని పవిత్రసాన్నిధ్యప్రాప్తి నొందుటకు, నీ యహంకారాగ్ని నిన్ను ఆటంకపరచునేమో, జాగరూకుడవు కమ్ము. నీ కృత్యము లకు దిగులుచెందకు, ‘ఆయన’ నాశ్రయింపుము. సత్యముగా, ‘ఆయన’ తన వదాన్యతగా, తానపేక్షించిన వారిని, ఔదార్యవశమున క్షమియించును; నిరంతరక్షమాశీలియును, సకలౌదార్యుడును నగు ‘ఆయన’ తప్ప దేవుడు లేడు. దేవుని కొఱకే నిన్ను ప్రబోధింపుచున్నాము. నీవీ యుపదేశము నంగీకరించియుండిన నీ ప్రయోజనమునకై వర్తించి యుండెడివాడవు; నీవు తిరస్కరించితివేని, ‘ఆయన’ నిశ్చయముగ నిన్నును, నిన్ననుసరించి భ్రాంతికి లోనైనవారందరిని పరిత్యజించును. నిన్ను పెడదారి పట్టించిన వానిపై దేవుడు నియంత్రణను కలిగియుండుట నవలోకింపుము! వినయముతో, అణకువతో, దైన్యముతో భగవంతుని చెంతకు తిరోగమింపుము; నిశ్చయముగా, ఆయన నీ పాపములను పోద్రోలును, ఏలయన నీ దేవదేవుడు నిక్కముగా క్షమాశీలి, శక్తివంతుడు, సకలదయాళువు.
ఉద్దేశ్యరహితముగ, ఎవ్వడేని వేరొకని ప్రాణమును తీసిన, మృతుని కుటుంబమునకు నూరు మిష్కల్‌ల సువర్ణమును పరిహారముగా నిచ్చుట ఆతని విధి. ఈ దివ్యఫలకమున నిర్దేశింపబడిన దానిని పాటింపుడు, దీని పరిధులను అతిక్రమించు వారు కావలదు.